గురు దేవతా స్తుతి – బాబా గోధుమలు పిండి విసిరిన కథ – దాని తత్త్వము. పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయిసత్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు.
ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు.
పిమ్మట శ్రీసరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీసాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు.
తదుపరి సృష్టిస్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్ధించి, శ్రీసాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.
తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి, వారు కొంకణదేశములో వెలసిరనియు, ఆభూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించినదనియు చెప్పుచు, వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి.
అటుపిమ్మట వారి గోత్రఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక, యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొ||న పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్ధనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారామ్, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడ ప్రార్థించెను.
తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనమునుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు, తన జ్యేష్ఠసోదరునకు నమస్కరించెను.
అటుపైన పాఠకులకు నమస్కరించి, తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్ధించెను.
చివరగా తన గురువు, దత్తావతారమును అగు శ్రీసాయిబాబాకు నమస్కరించి, తాను వారిపై పూర్తిగా నాధారపడి యున్నానని చెప్పుచు, ఈ ప్రపంచము మిథ్యయనియు, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు, నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికిని నమస్కరించెను.